ప్రజాశక్తి - పార్వతీపురం : స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 80 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఆర్.గోవిందరావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్, డిఆర్‌ఒ జె.వెంకట రావు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా భూసమస్యలు, వ్యక్తిగత, ఇతర సమస్యలపై ఉన్నాయి. కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి
పార్వతీపురంరూరల్ : స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఎస్‌పి విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఆయన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్పందనలో ఫిర్యాదు చేసిన వ్యక్తి పదే పదే పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉండకూడదని, బాధితులకుతక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పందనలో ఆరు ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో ఎఎస్పీ (అడ్మిన్) ఒ.దిలీప్ కిరణ్, ఎస్బి సిఐ సిహెచ్.లక్ష్మణరావు, డిసిఆర్‌బి సిఐ ఎన్‌వి ప్రభాకర్‌రావు, ఎస్‌ఐ పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు.
స్పందనకు 66 వినతులు
సీతంపేట : స్థానిక ఐటిడిఎ స్పందన కార్యక్రమానికి 66 వినతులు వచ్చాయి. సోమవారం స్పందన కార్యక్రమం పిఒ కల్పనాకుమారి ఆధ్వర్యంలో జరిగింది. వచ్చిన వినతుల్లో కొన్ని... సిరిగూడకు చెందిన రాజబాబు ఆటోలోను మంజూరు చేయాలని, పోంజాడకు చెందిన సరస్వతి చీపుర్లు రుణం ఇప్పించాలని కోరారు. నడిమిగూడకు చెందిన చిన్న లక్ష్మయ్య మేకల్లోను, మామిడి గూడకు చెందిన భాస్కరరావు కిరాణా షాపునకు రుణాలు ఇప్పించాలని కోరారు. సోలికిరికి చెందిన తెరిసా అంగన్వాడి కేంద్రం మంజూరు చేయాలని, చీమల గూడకు చెందిన జయ ప్రకాష్ సవర భాష వాలంటీర్ పోస్ట్ ఇప్పించాలని కోరారు. కిట్టలపాడుకు చెందిన లక్ష్మయ్య పవర్ వీడర్ మంజూరు చేయాలని పిఒ దృష్టికి తీసుకొచ్చారు. స్పందన కార్యక్రమంలో ఎపిఒ రోషిరెడ్డి, డిడి శ్రీనివాసరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.సింహాచలం, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ చిరంజీవి, జిసిసి డిఎం సంధ్యారాణి, డిప్యూటీ డిఇఒ లిల్లీరాణి, స్పోర్ట్స్ ఇంచార్జ్ జాకబ్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.










