Jan 06,2023 23:53

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌, పిఒ

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: ఐటిడిఎలో అంబేద్కర్‌ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన స్పందనకు 76 వినతులు వచ్చాయి. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ, జెసి జె.శివశ్రీనివాసు, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీవాస్తవ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూమి వివాదాలు, రహదారి సదుపాయాలు, తాగునీటి సమస్యలు, ఉపాధి అవకాశాల కోసం అధికంగా వినతులు సమర్పించారు. జి.కె.వీధి మండలం దేవరాపల్లి పంచాయతీ చుట్టిగొంది గ్రామస్తులు కె.గుండన్న, పి.ప్రసాద్‌, కె.త్రినాద్‌ గ్రామంలో 20 కుటుంబాలు జీవిస్తున్నాయని, మంచినీటి సదుపాయం కల్పించాలని వినతి పత్రం అందజేసారు. క ొయ్యూరు మండలం వెలగలపాలెం గ్రామంలో శిధిలావస్థలో ఉన్న పాత పంచాయతీ భవనం, కమ్యూనిటీ భవనం శిధిలాలను తొలగింపు పనులు చేసానని, పంచాయతీ నుండి డబ్బులు ఇప్పించాలని ఎస్‌.గంగా పవన్‌ వినతి పత్రంలో కోరారు. పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ పోయిపల్లి గ్రామస్తులు పి.అచ్చన్న, మర్రి రాజారావు, పొంగి అప్పులమ్మ తదితరులు తాగునీటి సదుపాయం, సిసి రోడ్లు నిర్మించాలని కోరారు. పాడేరు మండలం వర్తనాపల్లి పంచాయతీకి చెందిన సరమండి శుభలక్ష్మి తన తండ్రి బాలన్న సీడిగొంది గ్రామంలో 30 ఏళ్ల నుండి సాగు చేస్తున్న భూమికి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. పాడేరు మండలం పాత పాడేరు గ్రామానికి చెందిన కొర్రా కాంతమ్మ ఇంటి స్థలం మంజూరు చేయాలని అర్జీని అందజేసారు. అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ దాయర్తి గ్రామానికి సిసిడిపి కింద డిఆర్‌డిపో, అంగన్వాడీ భవనం మంజూరు చేసారని సకాలంలో పూర్తి చేయాలని కోరారు. నాడు నేడు కింద మంజూరైన పాఠశాల భవన నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు, డిఎంఅండ్‌హెచ్‌ఒ జమాల్‌ భాషా, ఎడిఎం అండ్‌ హెచ్‌ఒ లీలాప్రసాద్‌, టిడబ్ల్యూ ఇఇ డివిఆర్‌ఎం రాజు, పిఆర్‌ ఇఇలు కె.లావణ్యకుమార్‌, కొండయ్య పడాల్‌, డిఇఒ స్పందనకు 76 వినతులుపి.రమేష్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇఇ లీలాక్రిష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.