ప్రజాశక్తి - రంపచోడవరం
స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి 61 అర్జీలు అందాయి. వీటిని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే, సబ్ కలెక్టర్ శుభం బన్సల్, ఐటీడీఏ ఎపీఓ సిహెచ్.శ్రీనివాసరావు స్వీకరించారు. వై.రామవరం మండలం పాతకోట పంచాయతీ పరిధి తంగేడికోట నుండి కొప్పులకోట వరకు మెటల్ రోడ్డు, ఆర్.కొప్పులకోటలో సిసి రోడ్డు ఏర్పాటు చేయాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని, గృహాలు మంజూరు చేయాలని టి.బంతిరాజు కోరారు. చింతలపూడి పంచాయతీ పరిధి కన్నీరు వాగు చెక్ డ్యాంకు పూడికతీతలు తీయాలని, పెద్ద దెయ్యాలకట్టు వాగు నుండి పంట పొలాలకు 300 మీటర్లకు ఇరువైపులా సీసీ వాలు ఏర్పాటు చేయాలని ఆ పంచాయతీ ఉప సర్పంచ్ పల్లాల లచ్చిరెడ్డి అర్జీ ఇచ్చారు. చవిటిదిబ్బలులో ప్రభుత్వం ద్వారా రైతుల పొలాలకు ఏర్పాటు చేసిన సోలార్ పంప్ సెట్లు పని చేయడం లేదని, వాటిని బాగు చేయాలని గేదెల అబ్బాయి రెడ్డి కోరారు. రంపచోడవరం మండలం బందపల్లి నుండి పెదకోరుమిల్లి వరకు ఐదు కిలోమీటర్లకు బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని చవలం బుల్లి దొర విజ్ఞప్తి చేశారు. కాకవాడ నుండి కొయ్యలగూడెం వరకు 15 కిలోమీటర్లకు బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని, ఈతపల్లి కాలువపై వంతెన నిర్మించాలని ఆకూరు సర్పంచ్ కొమరం పండుదొర, ఎంపీటీసీ నర్రి పాపారావు విజ్ఞప్తి చేశారు. తను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానని, రెండు కాళ్లు పనిచేయడం లేదని, ఎటువంటి ఆధారం లేదని, తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని దేవీపట్నం మండలం దేవారం గ్రామానికి చెందిన వికలాంగురాలైన తుర్రం వెంకటలక్ష్మి దరఖాస్తు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్ శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నాగేశ్వరరావు, ఎండి యూసఫ్, వెలుగు ఏపిడి ఎ.శ్రీనివాసరావు. డిఎల్‌డిఓ కె.కోటేశ్వరరావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కల్పన, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.










