స్పందనకు 56 ఫిర్యాదులు
ప్రజాశక్తి- తిరుపతి సిటీ:
జిల్లా ఎస్పీ పరమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 56 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలకు సానుకూలంగా స్పందించి, ప్రతిఒక్కరి కేసువిషయాలను కూలంకశంగా అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీస్‌స్టేషన్ల అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం తెలిపారు. స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పందన ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించకూడదని పోలీస్ అధికారులను ఆదేశించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక పరమైన నేరాలు, ఆస్తి తగాదాలు, ఇతరత్రా కారణాలతో ప్రజలు ఫిర్యాదులు చేశారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీలు వెంకట్‌రావు అడ్మిన్, కులశేఖర్ లా ఆర్డర్, విమల కుమారి క్రైమ్, ఎస్బి డిఎస్పి గిరిధర్ పాల్గొన్నారు.










