ప్రజాశక్తి - రంపచోడవరం
స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 53 అర్జీలు వచ్చాయి. వీటిని ఐటిడిఎ ఎపిఒ సిహెచ్.శ్రీనివాసరావు స్వీకరించారు. వై.రామవరం మండలం చింతలపూడి పంచాయతీలోని చింతకొయ్య నుండి కొత్తాడ గ్రామాల మధ్య కన్నీరు వాగుపై వంతెన నిర్మించాలని, బొడ్డగండి పంచాయితీలోని మంగంపాడు గ్రామ సమీపాన తులసూరు కాలువపై చెక్ డాం నిర్మించాలని, నాగలోవ, అంటిలోవ, రాకోట గ్రామాలలో మినీ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు చేయాలని వినతులు అందాయి. పాలగడ్డ నుండి బొడ్డగండి వరకు మంజూరైన రహదారిని ఫారెస్ట్ క్లియరెన్స్ మంజూరు చేసి రోడ్డు ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు కోరారు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన కె.వీరవరం గ్రామంలోని 18 సంవత్సరాల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇంటి ప్యాకేజీ ఇవ్వాలన్నారు. రంపచోడవరం నుండి వై.రామవరం వరకు ఏలేశ్వరం, గోకవరం ఆర్టీసీ డిపోల నుండి బస్సులు ఏర్పాటు చేయాలని, భూపతిపాలెం ప్రాజెక్టు ముంపునకు గురైన కొత్తపాకలు గ్రామస్తులకు భూమికి భూమి, నష్ట పరిహారం, ఐదు గ్రామాల్లో 130 మంది బాధితులకు 360 ఎకరాల పందిగుంట బయలు భూమికి పట్టాలు మంజూరు చేయాలని అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జి.డేవిడ్ రాజు, ఎండి యూసఫ్, నాగేశ్వరరావు, వెలుగు ఏపిడి ఎ.శ్రీనివాసరావు, డిఎల్‌డిఓ కె.కోటేశ్వరరావు, ఎస్‌ఓ వి.కబోది, ఏడిఎంహెచ్‌వో డాక్టర్ అనూష, పలుశాఖ అధికారులు పాల్గొన్నారు.










