Aug 29,2023 00:27

సమస్యలు వింటున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌

ప్రజాశక్తి-రంపచోడవరం
స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 51 అర్జీలు అందాయి. వీటిని ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌, ఐటిడిఎ ఎపిఒ జనరల్‌ సిహెచ్‌.శ్రీనివాసరావు స్వీకరించారు. అడ్డతీగల మండలంలోని డి.రామవరం గ్రామంలో ఆశ వర్కర్‌ను నియమించాలని, చింతలపూడి పంచాయతీ పరిధిలోని బొడ్డగుంట, చింతకొయ్య గ్రామాల మధ్యలో కాలువపై వంతెన నిర్మించాలని, చింతలపూడి సచివాలయంలో మూడు నెలల నుండి ఫైబర్‌ నెట్‌ పనిచేయడం లేదని, వెంటనే మరమ్మతులు చేయించాలని, ఏజెన్సీలోని కొండరెడ్ల అభివృద్ధికి ప్రత్యేక సర్వే నిర్వహించాలని వినతిపత్రాలు అందాయి.
మారేడుమిల్లి గ్రామంలో ఏకలవ్య మోడల్‌ స్కూల్లో రన్నింగ్‌ వాటర్‌ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రెండు బోర్లు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు సరిపడా తరగతి గదులు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు మెనూ పక్కాగా అమలు చేయాలని దరఖాస్తు సమర్పించారు. 1950, 1956, 1976 సంవత్సరాలలో గిరిజన తెగలుగా గుర్తింపు పొందిన ఏజెన్సీలోని ఏడు గిరిజన తెగల వారికి జనన మరణాల రిజిస్టర్లు పరిశీలించి జీవో నెంబర్‌ 58 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు జాన్‌ రాజ్‌, డిఎస్‌.శాస్త్రి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు జి.డేవిడ్‌ రాజ్‌, ఎండి యూసఫ్‌, సుబ్బయ్య, పిహెచ్‌ఓ కె.చిట్టిబాబు, ఎడిఎలు కెసిహెచ్‌వి చౌదరి, కె.సావిత్రి, పిఎఓ రాంబాబు, ఎడిఎంహెచ్‌ఒ జి.భాస్కర్‌, సీనియర్‌ మేనేజర్‌ ముర్ల నాగ వెంకట రాజారెడ్డి, డిఎల్‌పిఓ రాఘవన్‌, సిడిపిఓ సంధ్యారాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు.