Jun 23,2023 23:42

స్పందనలో సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు: సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలో శుక్రవారం నిర్వహించిన స్పందనకు 170 ఫిర్యాదులు అందాయి. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ జె. శివ శ్రీనివాసు, ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవలతో కలిసి జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లా అధికారులు జగనన్న సురక్షా కార్యాక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పెదబయలు మండలం బొంగరం గ్రామ పంచాయతీ మట్టల గుమ్మి గ్రామంలోని ఉపాధి హామీ పనుల్లో వి. ఆర్‌.పి చిన్న తల్లి సక్రమంగా మస్టర్లు నమోదు చేయడం లేదని గ్రామస్తులు టి. విశ్వనాధం, టి.చిన్నారావు, పపెన్‌ కుమార్‌ ఫిర్యాదు చేసారు. జి.కె. వీధి మండలం జర్రెల పంచాయతీ గునుకురాయి గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని, జర్రెల గ్రామానికి డి ఆర్‌ డిపో భవనం మంజూరు చేయాలని సర్పంచ్‌ వి. నాగరాజు వినతి పత్రం సమర్పించారు. డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ దూదుగుడ గ్రామానికి తాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. పోతంగి పంచాయతీకి చెందిన కమ్మిడి నిర్మల, కించు మండ గ్రామానికి చెందిన బి. చిన్నెయ్య అటవీ హక్కుపత్రాలు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. జి.మాడుగుల మండలం పెదలోపలి పంచాయతీ గొడ్డు గుర్రాల బంధ గ్రామస్తులు పంతల చిరంజీవి, పాంగి సుందర రావు గొడ్డు గుర్రాల బంధ గ్రామం నుండి పనసల పాడు గ్రామం వరకు రోడ్డు నిర్మించాలని కోరారు. చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ పాత మాడెంబంధ గ్రామస్తులు ఎం. అప్పారావు, వి.రామన్న, ఎం.మత్స్యరాజు మాడెం బంద కొత్తవీధి నుండి మాడింబంద పాతవీధికి రోడ్డు నిర్మించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ఎపిఒ వి.ఎస్‌.ప్రభాకర్‌, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ.కొండలరావు, పంచాయతీ రాజ్‌ ఇఇ టి. కొండయ్యపదాల్‌, పిఐయు ఇఇ కె.లావణ్య కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు, జిల్లా విద్యాశాఖ అధికారి సలీం భాషా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమాల్‌, భాషా, డి.ఎల్‌.పి.ఓ పి.ఎస్‌. కుమార్‌, రహదారులు భవనాల శాఖ ఇఇ బాల సుందర బాబు తదితరులు పాల్గొన్నారు.