స్పందన వినతులపై ప్రత్యేక శ్రద్ధ
సమస్యలను నాణ్యతతో, గడువులోగా పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాలులో స్పందన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి, డిఆర్‌ఒ పుల్లయ్య, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఒ సుబ్బారెడ్డి, డిఆర్‌డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన అర్జీలపై జాప్యం లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా చూడాలన్నారు. పరిష్కారం కాని సమస్యలకు సరైన ఎండార్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేయాలన్నారు. లేని పక్షంలో మళ్లీ అవే పునరావతమయ్యే అవకాశముందన్నారు. పరిష్కార నివేదికలో అర్జీదారులకు అర్థమయ్యే విధంగా పూర్తి వివరాలతో ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమానికి వస్తుంటారని, అధికారులు వాటిని గుర్తించి పరిష్కరించాలన్నారు.










