ప్రజాశక్తి-పాడేరు:స్పందనలో అందిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు కృషి చేయాలని సంయుక్త కలెక్టర్ జె. శివ శ్రీనివాసు ఆదేశించారు. ఐటిడిఎలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 85 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, స్పందన ఫిర్యాదులపై సమీక్షిస్తూ పౖ తీసుకున్న చర్యలకు సంబంధించిన ఫోటోలను సచివాలయం ద్వారా స్పందన పోర్టల్ లో అప్ లోడ్ చేయాలన్నారు. మొక్కుబడి పరిష్కారం కాకుండా, సక్రమంగా చేయాలన్నారు. ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున ముఖ్యమంత్రి ఆశించిన రీతిలో పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
స్పందనకు గైర్హాజరైతే చర్యలు : పిఒ
జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు స్పందన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాలకృష్ణ స్పష్టం చేశారు. ఆయా కార్యాలయ ఉన్నతాధికారులు సమీక్షలు పెట్టినా, కోర్టు పనులున్నా, ఆరోగ్యం బాగు లేకపోయిన సందర్భాలలో తప్పనిసరిగా కలెక్టర్ వద్ద ముందస్తు అనుమతి పొందాలన్నారు. కార్యాలయ స్థాయిలో సమీక్షలుంటే స్పందన ముగిసిన తరువాత పెట్టుకోవాలని పిఓ సూచించారు. నిభందనలు ఉల్లింఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త జిల్లా ఏర్పడిన తరువాత ప్రజల ఆకాంక్షలు పెరిగాయని, ఆ మేరకు పని తీరు మెరుగు పరుచుకోవాలని సూచించారు. కోర్టు కేసులపై సకాలంలో స్పందించాలని, బిల్లుల చెల్లింపులపై ఎక్కువగా కేసులు వస్తున్నందున సరైన నివేదికలు సమర్పించాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జిల్లా వెనుకబడి ఉందని, మంజూరైన పనులు గ్రౌండింగ్‌లో కూడా వెనుకబడి ఉన్నామని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు త్వరగా గ్రౌండింగ్ చేయించాలని ఆదేశించారు. రానున్న సోమవారం ప్రత్యేక గ్రౌండింగ్ మేళాను నిర్వహిస్తున్నామని, పనులన్నీ గ్రౌండింగ్ చేయటానికి అధికారులు సిద్ధంగా వుండాలని ఆదేశించారు. స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ (ఎస్.సి.ఏ) నిధులు ఏడు కోట్ల రూపాయల వరకు ఉన్నందున, అందుకు సంబంధించిన బిల్లులను వెంటనే అప్‌లోడ్ చేయాలని పిఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు, అరకు డివిజన్ ఇఇ కె.వేణు గోపాల్, పిఆర్ పిఐయు ఇఇ కె.లావణ్య కుమార్, ఆర్ డబ్ల్యూఎస్ ఇఇ లీలాక్రిష్ణ, ఆర్‌అండ్ బి బాల సుందరబాబు, డిఎల్ పిఒ పిఎస్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.










