Dec 02,2022 23:44

వినతుల స్వీకరిస్తున్న కలెక్టర్‌, పిఒ

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: స్పందన వినతుల పరిష్కారం లో అధికారుల జవాబుదారీగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ, జెసి జె.శివ శ్రీనివాసు, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌లతో కలిసి వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఐటిడిఎ సమావేశ మందిరంలో శుక్రవారం 78 ఫిర్యాదులు స్వీరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై శుక్రవారం ఉదయం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలు పరిష్కరించాలన్నారు.సమస్యలు పరిష్కరించ లేకపోతే గ్రామాలకు వెళ్లి అర్జీదారులకు వివరించి అర్జీదారుని ఫోటోలను స్పందన వెబ్‌ సైట్‌లో నమోదు చేయాలని చెప్పారు. జిల్లా అధికారులు రెడ్‌ క్రాస్‌ సొసైటీలో జీవిత కాల సభ్యులుగా చేరాలన్నారు. రక్త సేకరణకు అధికారులు సహకరించాలని సూచించారు.
అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీకి చెందిన కిముడు దేముడు విశాఖపట్నం కెజిహెచ్‌లో డయాల సిస్‌ చేయించుకుంటున్నానని, ఫించను మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. పాడేరు మండలం వంజంగి సర్పంచ్‌ వంతాల బొంజుబాబు వంజంగి పంచాయతీలోని వై.సంపాలు, పోతురాజు మెట్ట, కల్లాల బయలు, దొడ్డిపల్లి, బొర్రమామిడి, గ్రామాలకు రోడ్లు నిర్మించాలని వినతి పత్రంలో కోరారు. కొయ్యూరు మండలం నిమ్మలగొంది గ్రామానికి రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు ఎస్‌.సత్తిబాబు, ఎస్‌. సత్యనారాయణ, వి.రంగారావు వినతిపత్రం అందజేసారు. రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ గుర్రాలు బైలు, గదభపాలెం, బి.పట్నం గ్రామాలకు చెందిన పివిటిజిలకు ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ పట్టాలు మంజూరు చేయాలని నల్లి పోతురాజు తదితరులు కోరారు. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ లోయల పాలెం గ్రామస్తురాలు కిల్లో చిన్నమ్మి తన ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ పట్టా భూమిని గిరి భూమి పోర్టల్‌ లో నమోదు చేయాలని కోరారు. అనంతరం సైనిక వెల్ఫేర్‌ శాఖకు చెందిన గోడ పత్రికను, స్టిక్కర్లను జిల్లా కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రంపులో ట్రైనీ కలెక్టర్‌ శ్రీవాత్సవ, జిల్లా సైనిక సంక్షేమాధికారి జి.సత్యానందం, టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు, డిఇఒ పి.రమేష్‌, డిఎంహెచ్‌ఒ జమాల్‌ భాషా, టిడబ్ల్యూ ఇఇలు డివిఆర్‌ఎం రాజు, కె.వేణుగోపాల్‌, ఆర్‌అండ్‌బి ఇఇ బాల సుందరబావు, తదితరులు పాల్గొన్నారు.