Feb 27,2023 20:38

కలెక్టర్‌కు సమస్యను విన్నవిస్తున్న మహిళ

స్పందన వినతులను నాణ్యతతో పరిష్కరించండి
జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     స్పందన వినతుల పరిష్కారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించి నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వైఎస్సార్‌ సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.నిశాంతితో కలిసి కలెక్టర్‌ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన వినతుల పరిష్కారంలో నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచుకొని పరిష్క రించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి దరఖాస్తును 24 గంటల్లో ఓపెన్‌ చేసి పరిష్కరించడమా లేదా తిరస్కరించడమా అనే అంశాలపై వివరణ ఇవ్వాలన్నారు. తిరస్కరించదలిస్తే సరైన కారణాలు విశ్లేషించి ఇవ్వాలన్నారు. ప్రతి స్పందన గ్రీవెన్స్‌ కూడా ఆడిట్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం రెవెన్యూ, పంచాయతీరాజ్‌ మున్సిపాలిటీ, హౌసింగ్‌, అగ్రికల్చర్‌, హెల్త్‌ తదితర శాఖల సిబ్బందిచే ఆడిట్‌ బృందాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మండల స్థాయిలో కూడా క్వాలిటీ డిస్పోజల్‌ పెరగాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న స్పందన కార్యక్రమంలో ఏ ఒక్కరు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించకుండా జవాబుదారి తనంతో పరిష్కరించాలన్నారు. కొన్ని మండలాలు, సచివాలయాల అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం వల్లే అధికంగా దరఖాస్తులు వస్తున్నాయన్నారు. ప్రతిరోజు సచివాలయంలో సాయంత్రం 3 నుండి 5 గంటల వరకు గ్రీవెన్స్‌ కార్యక్రమాన్నీ నిర్వహించాలన్నారు. స్పందన సమస్యల పరిష్కారంపై ప్రతిరోజు అర్థగంట సమయం కేటాయించాలన్నారు. ఏ ఒక్క దరఖాస్తు బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని మండలాల్లో పెండింగులో వున్న కోర్టు కేసులను నేరుగా కౌంటర్‌ ఫైల్‌ చేయకుండా జిల్లా కేంద్రంలోని పైఅధికారుల ఆమోదం తీసుకొని కౌంటర్‌ ఫైల్‌ చేయాలన్నారు. అలాగే కోర్టు ఉత్తర్వులను కూడా వెంటనే అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు. వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యే వ్యతిరేక వార్తలపై కూడా వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించి యాక్షన్‌ టేక్‌ అండ్‌ రిపోర్ట్‌లు సేకరించుకోవాలన్నారు. స్పందనలో జిల్లా రెవెన్యూ అధికారి బి. పుల్లయ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.