ప్రజాశక్తి-పాడేరుటౌన్: స్పందనలో గిరిజన సమస్యలు పరిష్కారానికి జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఐటిడిఎ బి.ఆర్.అంబేద్కర్ సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ వి.అభిషేక్‌తో కలిసి వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 42 అర్జీలు స్వీకరించారు. స్పందనలో స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి ప్రతీ సమస్యకు పరిష్కారం చూపించాలన్నారు. జికె వీధి మండలం గాలికొండ పంచాయతీ పోతునగుంట గ్రామస్తులు కిల్లో భాస్కరరావు, కొర్రా సింగరాజు, కొర్రా సన్యాసిరావు తదితర 13 మంది రైతులు రైతు భరోసా పడలేదని వినతి పత్రం సమర్పించారు. ముంచింగిపుట్టు మండలం బూసిపుట్టు పంచాయతీ బొర్రపనస గ్రామస్తులు భాస్కరరావు, శ్రీను మెయిన్ రోడ్డు నుండి బొర్రపనస గ్రామానికి రోడ్డు నిర్మించాలని అర్జీని అందజేసారు. చింతూరు మండలం తడికవాగు, రాజ్ క్యాంపు, మల్లవరం గ్రామస్తులు కె.సుందర్, కె.మంగ్ల తదితరులు విద్యుత్ సౌకర్యం కల్పించాలని వినతి పత్రంలో కోరారు. జికె వీధి మండలం గాలికొండ పాత్రుగుంట గ్రామస్తులు పి.సత్తిబాబు, కె.బాబూరావు, గాలికొండ నుండి బత్తునూరు మీదగా పాత్రుగుంట గ్రామానికి రహదారి నిర్మించాలని, తాగునీటి సదుపాయాలు కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. ముంచింగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ చెరువు వీధి గ్రామస్తులు సబడ బొజ్జయ్య, అప్పారావు తదితరులు కర్రీముక్కిపుట్టు నుండి ఎరుపువీధి గ్రామానికి మంజూరైన రోడ్డు నిర్మాణపు పనులు చేపట్టి రహదారి సదుపాయం కల్పించాలని కోరారు. చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ పోతుగుమ్మాలు గ్రామానికి చెందిన వంతల సాంబరి సర్వే నెంబర్ 8/1లో ఉన్న తన భూమిని వెబ్ ల్యాండ్ వంతల చికును అని చూపిస్తోందని పేరును సవరించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ లబ్బంది గ్రామానికి చెందిన పొంగి బిములు వైఎస్‌ఆర్ చేయూత పథకం మంజూరు చేయాలని కోరారు. ముంచింగిపుట్టు మండలం డింబుగుడ గ్రామానికి చెందిన పంజరి ప్రవళ తన కుమారుడు పంజరి మంజునాయుడు పేరు తప్పుగా నమోదు చేయడంతో అమ్మ ఒడి మంజూరు కావడం లేదని ఇంటి పేరును వైట్ సైట్‌లో సవరించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ఎపిఒ విఎస్ ప్రభాకరరావు, టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇఇ లీలాక్రిష్ణ, టిడబ్ల్యూ ఇఇలు డివిఆర్‌ఎం రాజు, కె.వేణుగోపాల్, డిఎల్ పిఒ పిఎస్ కుమార్, ఆర్ అండ్ బి ఇఇ బాల సుందరబాబు, డిఆర్‌డిఎ పిడి మురళి, పిఆర్ ఇఇలు కె.లావణ్యకుమార్, కొండయ్య పడాల్, తదితరులు పాల్గొన్నారు.










