ఐటిడిఎ పిఒ సూరజ్ గనోరే
ప్రజాశక్తి - రంపచోడవరం
స్పందనలో దరఖాస్తులు వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఐటిడిఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పిఒతో పాటు సబ్ కలెక్టర్ శుభం బన్సల్, ఐటీడీఏ ఎపీఓ సిహెచ్ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 28 దరఖాస్తులు వచ్చాయి. ఉపాధి హామీ పనులు కల్పించాలని, తాగునీటి బోర్లు, ఆర్ అండ్ బి రోడ్డు వరకు సీసీ రోడ్డు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. కొండపోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని రంప గ్రామానికి చెందిన నేర్రం స్వామి విజ్ఞప్తి చేశారు. దేవిపట్నం మండలం ఏనుగుల గూడెం గ్రామానికి చెందిన బొరగా నాగరాజు దొర వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. మెట్టగూడెం గ్రామస్తులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని పూనెం శుభలక్ష్మి దరఖాస్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జి.డేవిడ్ రాజ్, నాగేశ్వరరావు, వెలుగు ఏపిడి ఎ.శ్రీనివాసరావు, ఏడిఎంహెచ్‌వో డాక్టర్ అనూష, డాక్టర్ రాధిక పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.










