ప్రజాశక్తి - టి.నరసాపురం
స్పందన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని మండల ప్రత్యేక అధికారి జివివి.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు నెలల్లో స్పందనలో వచ్చిన ఫిర్యాదులు వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలపై శాఖలవారిగా సమీక్షించినట్లు ఆయన తెలిపారు. విద్యాశాఖ, ఐసిడిఎస్‌లలో నాడు-నేడు పనుల పురోగతిపై, గ్రామ పంచాయతీలో నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల ప్రగతిపై, వ్యవసాయ, గృహ నిర్మాణ శాఖల పనితీరు, ప్రజల ఆరోగ్యం పట్ల ఆరోగ్య శాఖ చేపడుతున్న చర్యలపై సమీక్షించినట్లు తెలిపారు. వేసవి దృష్ట్యా మంచినీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జెవి.సుబ్బారావు, మండల అభివృద్ధి అధికారి ఎన్‌టి.స్వామి, విద్యాశాఖాధికారి టి.రామ్మూర్తి, ఎఒ డి.ముత్యాలరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇ కె.గంగరాజు, పిఆర్ ఎఇ సంపత్ కుమారి, పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.










