May 02,2023 00:29
''స్పందన'' నిర్వహిస్తున్న బాపట్ల ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: స్పందన ఫిర్యాదులు చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ 'స్పందన' కార్యక్రమం నిర్వహించా రు. స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు వారి సమస్యలను స్వయంగా ఎస్పీకి విన్నవించుకొన్నారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, ''స్పందన'' ఫిర్యాదులు చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. 'స్పందన' ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నిర్ణీత సమయంలో నివేదికను అందించాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. ఈ రోజు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వరకట్నం వేధింపులు, కుటుంబ సమస్యలు, భూవివాదాలు, ఆర్థికపరమైన లావాదేవీల సమస్యలు, ఇతర సమస్యలతో మొత్తం 38 మంది ఫిర్యాదుదారులు వారి సమస్యలను జిల్లా ఎస్పీకి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ ఎస్పీ పి మహేష్‌, డిసిఆర్‌బి డిఎస్‌పి జి లక్ష్మయ్య, స్పందన సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి మాలకొండయ్య పాల్గొన్నారు.