ప్రజాశక్తి-బాపట్ల జిల్లా
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను చట్ట పరిధిలో త్వరితగతిన విచారించి పరిష్కరించాలని జిల్లా ఎస్‌పి వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'స్పందన' కార్యక్రమాన్ని ఎస్‌పి నిర్వహించారు. స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు వారి సమస్యలను ఎస్‌పికి విన్నవించుకున్నారు. వారు ఇచ్చిన అర్జీలను ఎస్‌పి పరిశీలించి వెంటనే సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చట్ట పరిధిలో త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేకూరేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 'స్పందన' ఫిర్యాదులు పునరావృతం కాకుండా పరిష్కరించాలన్నారు. స్పందన కార్యక్రమానికి ఎక్కువగా కుటుంబ కలహాలు, ఆర్థికపరమైన నేరాలు, ఆస్తి తగాదాలు, ఇతరత్రా కారణాలతో 80 పిటిషన్లు వచ్చాయి. ఈ స్పందన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్, స్పందన సెల్ ఇన్‌స్పెక్టర్ వి మాలకొండయ్య పాల్గొన్నారు.










