Jul 17,2023 21:00

పోలీస్‌ స్పందనలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్‌పి

స్పందన ఫిర్యాదులకు ప్రాధాన్యత : ఎస్‌పి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     స్పందన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌ రెడ్డి సంబంధిత పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదిదారుల నుంచి జిల్లా ఎస్పీ అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదిదారుల సమస్యలను ఎస్పీ తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. స్పందన ఫిర్యాదులలో ఎక్కువగా సివిల్‌ తగాదాలు, కుటుంబ కలహాలు, అన్నదమ్ముల ఆస్థి పంపకాలలో మనస్పర్దలు, ఉధ్యోగం ఇప్పిస్తామని మోసాలు తదితర సమస్యలు ఉన్నాయి. ఫిర్యాదిదారులకు ఓంకారం ధేవస్థానం వారు భోజన వసతి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీఐ దస్తగిరి బాబు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ సూర్యమౌళి తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులలో కొన్ని..
- 'నా పెద్ద కుమారుడు కోట.వెంకటరాముడు నాకున్న ఆస్థిని లాక్కొని నన్ను ఇంటినుండి గెంటేశాడు.. నాకు న్యాయం చేయండి' అని ఉయ్యలవాడ మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన కె .సంజమ్మ ఫిర్యాదు చేసింది
- 'నందికొట్కూర్‌ టౌన్‌లో నా షాపును వి.బాలనాగరాజుకి 3 సంవత్సరాలు ఆగ్రిమెంట్‌ ప్రకారం బాడుగకు ఇచ్చాను. గడువు తీరిన తర్వాత షాపును ఖాళీ చేయకుండా, బాడుగ ఇవ్వకుండా దుర్భాషలాడాడు. న్యాయం చేయండి' అని బి.విశ్వనాథం శెట్టి ఫిర్యాదు చేశాడు.
- 'నంద్యాలలో టీటీడీ రోడ్డులో ఉయ్యలవాడ మండలం పెద్దమ్మనూరు గ్రామానికి చెందిన యూ.వెంకట సుబ్బయ్య సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌ను ఓపెన్‌ చేసి హైదరాబాదులోని కంపెనీలలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక్కొకరి వద్ద రూ. 3 లక్షలు తీసుకొని ఉద్యోగం ఇప్పిచకుండా, డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడు. న్యాయం చెయ్యండి' అని హెచ్‌.ఎస్‌ కొట్టాల గ్రామం ఎం.శ్రీకాంత్‌ రెడ్డి, హైమావతిలు ఫిర్యాదు చేశారు.