వేపాడ: మండలంలోని వావిలిపాడు గొల్లవీధిలో సిసి రోడ్డుకు ఇరువైపులా నిర్మించి కాలువ పనుల్లో అవకతవకలు జరిగాయని జిల్లా కలెక్టర్ స్పందన విభాగంలో శ్రీను అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ పైడిరాజు మంగళవారం గ్రామంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. కాలువకు ఇరువైపులా నివసిస్తున్న వారిని కాలువ నిర్మాణం వల్ల కలిగే నష్టం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పరిణికాన రమణమ్మ, నూనెల మహాలక్ష్మమ్మ, రోమాల సన్యాసమ్మ, దేవుడమ్మ, గోవిందమ్మ, గండి శ్రీను మాట్లాడుతూ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా బీల రాజేశ్వరి సర్పంచ్‌గా పని చేస్తున్నారని గ్రామాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కాలువ నిర్మాణం వల్ల 35 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులు తొలగిపోయాయని చెప్పారు. కాలువలో ఎటువంటి అవకతవకలూ జరగలేదన్నారు. ఎవరో సర్పంచ్‌పై బురద జల్లడానికే ఇటువంటి ఫిర్యాదు చేశారని కొట్టిపారేశారు. అనంతరం డిఇఒ పైడిరాజు మాట్లాడుతూ మీకు ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ పరిశీలనలలో ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ దేవి, ఫిర్యాదుదారుడు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.