పుట్టపర్తి అర్బన్ : ప్రజలు సంతప్తి పొందే విధంగా స్పందన, జగనన్నకు చెబుదాం అర్జీలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమాన్ని సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, డిఆర్‌ఒ కొండయ్య, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, ఆర్డీవో భాగ్యరేఖ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అధికారులు 260 అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో డివిజన్, మండల స్థాయి అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్పందన అర్జీలను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. ఇందులో ఎలాంటి అలసత్వాన్ని అధికారులు ప్రదర్శించరాదన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో సమీక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈనెల 14న పుట్టపర్తి నియోజకవర్గం సమావేశం పూర్తి చేశామన్నారు. ఈనెల 21న మడకశిర నియోజకవర్గంకు సంబంధించి మడకశిరలోని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో సమీక్ష జరుగుతుందన్నారు. సమావేశంలో ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మనూరు జయరాం, స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామిలు పాల్గొంటారన్నారు. నియోజకవర్గంలో మండలాల వారీగా సమీక్ష జరుగుతుందని, సంబంధిత అధికారులు అందరూ ఇందులో పాల్గొనాలని ఆదేశించారు. నాడు-నేడు, గహ నిర్మాణం, మైనింగ్, గతంలో వర్షాల వల్ల నష్టపోయిన పంటల వివరాలపై సమీక్ష జరుగుతుందన్నారు. ఆయా శాఖల అధికారులు ఈనెల 19న నియోజకవర్గం సమస్యల వివరాలను సిపిఒకు అందజేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతిరోజు లక్ష మంది ఉపాధి కూలీలకు పనులు కల్పించాలనే లక్ష్యం ఉండగా 65 వేలమందికి పనులు కల్పిస్తున్నారని, కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పెనుకొండ, రామగిరి, రొద్దం, చిలమత్తూరు మండలాలలో 20 నుంచి 25 శాతం మాత్రమే లక్ష్యాన్ని చేరుకున్నారని, ఇక్కడ ఉపాధి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ విజరుకుమార్, గహ నిర్మాణ శాఖ పీడీ చంద్రమౌళిరెడ్డి, పిఆర్‌ఎస్‌ఇ గోపాల్ రెడ్డి, డిఎంహెచ్‌ఒ కష్ణారెడ్డి అధికారులు పాల్గొన్నారు.










