Mar 06,2023 23:46

అర్జీదారులతో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే, చిత్రంలో సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ తదితరులు

ప్రజాశక్తి - రంపచోడవరం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందనలో పిఒ సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌, ఐటిడిఎ ఎపిఒ జనరల్‌ సిహెచ్‌.శ్రీనివాసరావు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 57 దరఖాస్తులు అందాయి. దేవీపట్టణ మండలం తున్నూరు పంచాయతీ పరిధి, పొన్నూరులో అంగన్వాడీ కేంద్రానికి నూతన భవనం ఏర్పాటు చేయాలని, వేములకొండ నుండి తున్నూరు వరకు మూడు కిలోమీటర్ల బిటి రోడ్డు, ఆకూరు గ్రామం నుండి మామిడివలస వరకు ఐదు కిలోమీటర్లకు మెటల్‌ రోడ్డు ఏర్పాటు చేయాలని తున్నూరు సర్పంచ్‌ సాధల విజయ భాస్కరరెడ్డి వినతిపత్రం అందజేశారు. తూన్నూరు పంచాయితీ పరిధి వెలగపల్లి సెంటర్‌ నుండి పెదనుతులు వరకు 7కిలోమీటర్లు బిటి రోడ్డు నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయని, దానిని పూర్తి చేయాలని కొండ్ల శివారెడ్డి. ములగల శ్రీనివాస్‌ రెడ్డి దరఖాస్తు చేశారు.
వై.రామవరం మండలం దళిపాడులో సర్వే నెంబర్‌ 14/1 లోని భూ సమస్యను పరిష్కరించాలని ఆ గ్రామ సర్పంచ్‌ కర్రి వెంకయ్యమ్మ విన్నవించారు. మారేడుమిల్లి మండలం పందిరిమామిడి కోట గ్రామంలో 70మంది రబ్బర్‌ రైతులకు స్మోకింగ్‌ చాపర్‌ నిర్మిచాలని రేవులా జానకి రెడ్డి, కత్తుల సోమిరెడ్డి విన్నవించారు. బురదకోట నుండి గుడ్లవాడ వరకు ఏడు కిలోమీటర్లకు మెటల్‌ రోడ్డు ఏర్పాటు చేయాలని పాతకోట సర్పంచ్‌ గొర్లె రేవతి దరఖాస్తు సమర్పించారు. రంపచోడవరం మండలం సూర్లవాడలో మూసివేసిన ఎంపీపీ స్కూల్‌ను తిరిగి తెరిపించాలని కుర్ల చిరంజీవి రెడ్డి, కుర్ల గంగిరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ డిఎస్‌ శాస్త్రి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు నాగేశ్వరరావు, ఎండి యూసఫ్‌, వెలుగు ఎపిడి ఎ.శ్రీనివాసరావు, పిహెచ్‌ఓ చిట్టిబాబు. డిఎల్‌పిఓ శ్రీనివాసరావు, డిఎల్‌డిఓ కోటేశ్వరరావు, డాక్టర్‌ రాధిక, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, డాక్టర్‌ గోపిక, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కల్పన, జిసిసి మేనేజర్‌ ఎం.నాగరాజారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.