అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్
ప్రజాశక్తి -రంపచోడవరం
స్పందన కార్యక్రమానికి గ్రామాల సమస్యలు, వ్యక్తిగత సమస్యలపై వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో జెసి శివ శ్రీనివాస్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే, సబ్ కలెక్టర్ శుభం బన్సల్, ఐటిడిఎ ఎపిఓ సిహెచ్.శ్రీనివాసరావు, పలు శాఖల అధికారులు స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్పందన కార్యక్రమానికి 70 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ అర్జీలకు సంబంధించి వెంటనే పరిష్కరించగలిగే వాటిని వెంటనే పరిష్కరించాలని, మిగిలిన వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్లు, కల్వర్టులు ఏర్పాటు, వైద్యులను నియామకం, ఉద్యోగాలు అవకాశాలు కల్పన, భూ సమస్యలు పరిష్కారం, సెట్ టవర్లు ఏర్పాటు వంటి దరఖాస్తులతో పాటు వికలాంగుల సర్టిఫికెట్లు, మరికొన్ని వ్యక్తిగత సమస్యలపైనా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జి.డేవిడ్ రాజు, నాగేశ్వరరావు, వెలుగు ఎపిడి ఎ.శ్రీనివాసరావు, ఐటీడీఏ పరిపాలన అధికారి డిఎన్‌వి.రమణ, ఎస్‌ఓ కబోది, డిఎల్‌డిఓ కె.కోటేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
గృహాలకు ఎస్‌టి సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేయండి
కేంద్ర ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన 582 గృహాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి లక్ష రూపాయలు చొప్పున విడుదల చేయాలని టిడిపి మండల అధ్యక్షులు కారం సురేష్‌బాబు ఐటిడిఎ స్పందన కార్యక్రమంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేస్‌మెంట్ లెవెల్, రూప్ లెవెల్, లింటల్ లెవెల్‌లో ఉన్న గృహాలకు మూడేళ్లగా పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పశువర్థక శాఖ ద్వారా నిర్మించిన గోకులాల బిల్లులు ఇవ్వకపోవడంతో పాడి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన ఐటిడిఎ పిఒ ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సర్పంచ్ వంతల అచ్చియమ్మ, రామన్న దొర, పెంటమ్మ, చల్లన్న ఉన్నారు.










