
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ప్రజల నుండి అందే స్పందన అర్జీల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్‌ఓ పెద్ది రోజా, మచిలీపట్నం ఆర్డిఓ ఎం వాణి, జడ్పీ సీఈవో జ్యోతిబసులతో కలిసి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజలు వివిధ ప్రాంతాల నుండి ఎంతో శ్రమకోర్చి వ్యయ ప్రయాసలతో జిల్లా కేంద్రానికి వస్తున్నారని స్పందన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సానుకూలంగా పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ, డ్వామా పిడిలు పి ఎస్ ఆర్ ప్రసాద్, జీవీ సూర్యనారాయణ, డిపిఓ నాగేశ్వర్ నాయక్,ముడా విసి రాజ్యలక్ష్మి, డీఈవో తహేరా సుల్తానా, డి ఎస్ ఓ పార్వతి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ విజరు కుమారి, ఐసిడిఎస్ పిడి సువర్ణ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.