ప్రజాశక్తి-విశాఖపట్నం : స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోను రీ ఓపెన్ కాకూడదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన దరఖాస్తుల పరిష్కారం మరియు పలు విషయాలపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ, స్పందన కార్యక్రమం ద్వారా వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశిత సమయంలో పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తించిన పనులను ప్రాధాన్యత అంశం వారీగా తక్షణమే టెండర్లు పిలిచి పనులను ప్రారంభించి, పూర్తి చేయాలని జీవీఎంసీ, పంచాయితీరాజ్, ఎంపీడీఓలను ఆదేశించారు. ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న గ్రీవెన్స్‌లు వెంటనే పరిష్కరించి స్పందన పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. తదుపరి కలెక్టర్ స్పందన కార్యక్రమంలో ప్రజలనుండి విజ్ఞప్తులు స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో 220 విజ్ఞప్తులు అందాయి. ఈ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కెఎస్.విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, ఆర్‌డిఒ హుస్సేన్ సాహెబ్ పాల్గొన్నారు.










