విశాఖపట్నం : స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోను రీ ఓపెన్ కాకూడదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన దరఖాస్తుల పరిష్కారం మరియు పలు విషయాలపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కాలపరిమితిలోగా స్పందన దరఖాస్తులన్నింటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశించారు. మంజూరు చేసిన ఇళ్లు అన్నింటినీ గ్రౌండింగ్ చేయాలన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా తల్లుల ఖాతాలలో జమ చేసిన ఫీజులను కాలేజీ యాజమాన్యాలకు అందేలా చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయాలలో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ఈనెల 21న నిర్వహించే జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
తదుపరి కలెక్టర్ స్పందన కార్యక్రమంలో ప్రజలనుండి విజ్ఞప్తులు స్వీకరించారు. స్పందనకు 225 విజ్ఞప్తులు అందాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కెఎస్.విశ్వనాథన్ , జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, ఆర్‌డిఒ హుస్సేన్ సాహెబ్ పాల్గొన్నారు.










