May 09,2023 01:21
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టరు రంజిత్‌ బాషా

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: స్పందనలో వచ్చిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టరు పి రంజిత్‌ బాషా ఆదేశించారు. స్పందన కార్యక్రమం సోమవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తమ సమస్యలను విన్నవిం చుకోవడానికి రాగా 102 అర్జీలు నమోదయ్యాయి. తన పరిధిలోని సమస్యలకు కలెక్టరు తక్షణమే పరిష్కారం చూపగా మిగిలిన వాటిని నిశితంగా పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. స్పందన అర్జీలపై అధికారులలో నిర్లిప్తత ఉండరాదని కలెక్టరు చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులతోపాటు వీక్షణ సమావేశం ద్వారా మండల స్థాయి అధికారులతో కలెక్టరు మాట్లాడారు. రీసర్వే ప్రక్రియలో హద్దురాళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియలో బాపట్ల జిల్లా పురోగతి తక్కువగా ఉండడంపై అధికారులను నిలదీశారు. తహశీల్దార్లు నిర్లిప్తంగా ఉండడం మంచిపద్ధతి కాదని అన్నారు. విధినిర్వహణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టరు సిహెచ్‌ శ్రీధర్‌, డిఆర్‌ఓ కె లక్ష్మీ శివజ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.