Mar 27,2023 23:56

కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న సిపిఐ నాయకులు,

ప్రజాశక్తి- అనకాపల్లి
స్పందనలో వచ్చే అర్జీలను పూర్తిస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలకు సంబంధించి 175 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన దరఖాస్తులను తిరస్కరించినట్లయితే అందుకు గల కారణాలను దరఖాస్తుదారునికి తెలియజేప్పాలన్నారు. కార్యక్రమంలో జెసి కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ఆలోచన విరమించాలి
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో నేడు ప్రాజెక్టు ఎత్తు తగ్గించి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర చేస్తోందని, తక్షణమే ఈ ఆలోచన విరమించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం పదేపదే అన్యాయం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడం అన్యామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం రాము నాయుడు, ఆర్‌ దొరబాబు, గురు బాబు, సుబ్బలక్ష్మి, సన్యాసిరావు, వైఎన్‌ భద్రం, కన్నబాబు సత్తిబాబు రాజు తదితరులు పాల్గొన్నారు.
కల్వర్టులను పునర్నిర్మించాలని సిపిఎం వినతి
చోడవరం : చోడవరం రోడ్డులోని గోవాడ, వెంకన్నపాలెం వద్ద శిథలమై ప్రమాదకరంగా ఉన్న కల్వర్టులను వెంటనే పునర్నిర్మించాలని, రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఎం చోడవరం మండల కమిటీ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి శ్రీనివాసరావు, మండల నాయకులు ఎస్వీ నాయుడు, బి దేవుళ్ళు పాల్గొన్నారు.