Aug 22,2022 23:15

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున

ప్రజాశక్తి-విశాఖపట్నం : స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రీ ఓపెన్‌ కాకూడదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో స్పందన దరఖాస్తుల పరిష్కారం, పలు విషయాలపై అధికారులతో జిల్లా కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భముగా కలెక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ, స్పందన వినతుల పరిష్కారంలో అలక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశిత సమయంలో పరిష్కరించాలన్నారు. ప్రొబేషన్‌ పూర్తయిన సచివాలయ ఉద్యోగులకు సిపిఎస్‌ నంబర్‌ రావటానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న ముఖ్య సూచనలు ఆలస్యం చేయకుండా అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న జగనన్న తోడు, విద్యా దీవెన వంటి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించే విషయంలో అలసత్వం వలదన్నారు. ఎఎన్‌ఎంలు, మహిళా పోలీసులు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు వారి పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తరుచూ తనిఖీలు నిర్వహించి, పిల్లల సంక్షేమం కొరకు కృషి చేయాలన్నారు. అసంఘటిత రంగ కార్మికుల వివరాలను వెంటనే ఇ-శ్రమ్‌ యాప్‌లో నమోదు చేయించాలని జిల్లా లేబర్‌ అధికారికి ఆదేశించారు. ప్రతి సచివాలయంలో ఐఆర్‌సిటిసి ద్వారా ట్రైన్‌ టికెట్‌ బుకింగ్‌ సేవలు ప్రారంభించటం జరిగిందని, వాటిని ప్రజలు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిఎస్‌డబ్ల్యుఎస్‌ కో-ఆర్డినేటర్‌ను ఆదేశించారు. ఎపి సేవ పోర్టల్‌ ద్వారా సచివాలయంలో అందుతున్న వినతులు సంఖ్య చాలా తక్కువగా ఉందని, కావున ప్రతి ఒక సచివాలయంలో దీనిపై ప్రత్యేక దష్టి సారించాలని జివిఎంసి అధికారులను ఆదేశించారు. తదుపరి జిల్లా కలెక్టర్‌ స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. సోమవారం స్పందన కార్యక్రమంలో 190 విజ్ఞప్తులు అందాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, ఆర్‌డిఒ హుస్సేన్‌ సాహెబ్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.