Oct 09,2023 22:24

ప్రజాశక్తి - ఏలూరు
           'జగనన్నకు చెబుదాం' స్పందనలో అందిన అర్జీలకు సత్వరపరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి, డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ పీడీ ఆర్‌.విజయరాజు, జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్‌, ఆర్‌డిఒ ఎన్‌ఎస్‌కె.ఖాజావలి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జివివి.సత్యనారాయణ, జిఎస్‌డబ్ల్యూఎస్‌ నోడల్‌ ఆఫీసరు రమణ హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 414 అర్జీలను స్వీకరించామన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దరఖాస్తులను నాణ్యతతోపాటు నిర్ధేశించిన సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను క్షుణ్నంగా పరిశీలించి నాణ్యతతో వాటి పరిష్కారానికి సంబంధించిన ఫొటోతో సహా అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని తెలిపారు. ప్రతీ సోమవారం మండల టీము అర్జీల ఆడిట్‌పై చర్చించారు. వివిధ సమస్యల పరిష్కారానికి తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చే ప్రజలను ఆరగంటకు మించి వేచిచూడకుండా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం జిల్లా, మండల అధికారులతో జెసి మాట్లాడుతూ స్పందన అర్జీల్లో రీఓపెన్‌ అయిన వాటిని పెండింగ్‌లో ఉంచకుండా సత్వర పరిష్కారం చేయాలన్నారు. స్వమిత్వ సర్వేకు సంబంధించి పనులన్నీ వేగవంతం చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శి, విలేజ్‌ సర్వేయర్‌, విఆర్‌ఒలు, ఇందుకు సంబంధించిన సర్వేని యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేలా తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇకెవైసి, రీ సర్వే, రెవెన్యూ సర్వీసెస్‌కు సంబంధించిన అంశాలను పెండింగ్‌ లేకుండా చూడాలని తహశీల్దార్లను ఆదేశించారు.
అందిన అర్జీల్లో కొన్ని..
కామవరపుకోట మండలం కళ్లచెరువుకు చెందిన ఎం.దుర్గాలక్ష్మీ అర్జీని ఇస్తూ తమ పేరున ఉన్న భూమిని సర్వేచేసి భూమిని ఆక్రమించుకోవడానికి ప్రత్నిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ ఈ విషయంపై సంబంధిత తహశీల్దారు, డిఎస్‌పి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేగేశ్న కృష్ణవేణి అర్జీని అందిస్తూ తన భర్త సత్యనారాయణ చేపల చెరువులో పడవ బోల్తాపడి ప్రమాదవశాత్తు మరణించారని తనకు సిఎంఆర్‌ఎఫ్‌ ఫండు మంజూరు చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కొయ్యలగూడెం మండలం కుంతలగూడేనికి చెందిన షేక్‌ నజీమున్నీస తమ భూమి సర్వేకి సంబంధించిన పాస్‌ పుస్తకంలో రెండుసెంట్లు భూమి తక్కువ నమోదైందని దాన్ని సరిచేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు. కైకలూరు మండలం ఆనందరావుపేటకు చెందిన జంగం హరిబాబు తమ భూమికి దారికి కొంతమంది అడ్డుపడుతున్నారని వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.