ప్రజాశక్తి-కాకినాడ జగనన్నకు చెబుదాం -స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతప్తికరమైన పరిష్కారాలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో డిఆర్‌ఒ కె.శ్రీధర్ రెడ్డి, సివిల్ సప్లరు డిఎం డి.పుష్పమణి, కెఎస్‌ఇజెడ్ డిప్యూటీ కలెక్టర్ కె.మనోరమతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను సావధానంగా విని, అర్జీలను సత్వరం పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 504 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కతికాశుక్లా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అందిన ప్రతి వినతినీ క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సిఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
ముఖ్యమంత్రి వైఎస్.జగన్ సామర్లకోట పర్యటన ఈ నెల 12న ఖరారైన నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, డిఆర్‌ఒ కె.శ్రీధర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులతో సిఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. సామర్లకోట ఇటిసి జగనన్న కాలనీలో గృహ నిర్మాణ పనులు, హెలిప్యాడ్, ఫైలాన్, పార్క్, బస్సు, ఆటోలు పార్కింగ్, రోడ్ షో, స్టాల్స్, ఫోటో ప్రదర్శన స్పందన వాలంటరీల ద్వారా అర్జీల స్వీకరణ, లబ్ధిదారుల తరలింపు వంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.










