ప్రజాశక్తి - ఏలూరు
రాష్ట్ర ప్రభుత్వ స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతిస్తుందని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జెసి బి.లావణ్యవేణి, డిఆర్‌ఒ మూర్తి, జెడ్‌పి సిఇఒ రవికుమార్, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, ఆర్‌డిఒ కె.పెంచల కిషోర్‌తో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాసమస్యలను తక్షణం పరిష్కరించేలా అధికార యంత్రాంగం పనిచేయ్యాలని కలెక్టర్ సూచించారు. అధికారులు ప్రతి అర్జీని ఆడిట్ చేసి ఎండార్స్‌మెంట్‌ను అర్జీదారునికి అందజేయాలని తెలిపారు. ఈనెల 25వ తేదీన జాతీయ మలేరియా నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో మున్సిపల్ కమిషనర్, రూరల్‌లో వైద్యఆరోగ్య శాఖాధికారులు, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ, సచివాలయ సిబ్బంది, విద్యాశాఖ ద్వారా పాఠశాలల్లో ఉపాధ్యాయులు మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీని, అవగాహన సదస్సులను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా ప్రబలుతుందని దీన్ని అరికట్టడానికి ఐటిడిఎ అధికారులు, సిబ్బంది మలేరియా నుండి ప్రజలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. స్పందన కార్యక్రమం ద్వారా 265 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.










