Nov 28,2022 23:07

230 అర్జీలు స్వీకరణ: కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌
ప్రజాశక్తి - ఏలూరు

               'స్పందన'లో అందిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. స్పందనలో వచ్చిన అర్జీలు తిరిగి రీఓపెన్‌ కాకుండా చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు. స్పందనలో అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించడంతోపాటు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం 230 అర్జీలు అందాయి. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు, డిఆర్‌ఒ ఎవిఎన్‌ఎస్‌.మూర్తి, ఏలూరు ఆర్‌డిఒ కె.పెంచలకిషోర్‌, జెడ్‌పి సిఇఒ రవికుమార్‌, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు పాల్గొని అర్జీలను స్వీకరించారు.
అత్యధిక స్వచ్ఛ గ్రామాలు సాధించాలి
'స్వచ్ఛ సర్వేక్షన్‌' గ్రామీణ పోటీల్లో జిల్లాను జాతీయ స్థాయిలో నిలిపేలా అత్యధిక స్వచ్ఛ గ్రామాలు సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఎంపిడిఒలకు సూచించారు. స్థానిక కలెక్టరేట్‌ నుండి జిల్లాలోని ఎంపిడిఒలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో 'స్వచ్ఛ సర్వేక్షన్‌' గ్రామీణ పోటీలకు సమాయత్తంపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 'స్వచ్ఛ సర్వేక్షన్‌' గ్రామీణ కార్యక్రమం ద్వారా జిల్లాలోని సంపూర్ణ పారిశుధ్య పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర బృందం మరికొద్ది రోజుల్లో జిల్లాలో పర్యటిస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పూర్తిస్థాయిలో సంపూర్ణ పారిశుధ్య పరిస్థితులు కలిగిన గ్రామాలను 'స్వచ్ఛ సర్వేక్షన్‌' గ్రామాలుగా ఎంపిక చేసి అవార్డులను అందజేస్తుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే గ్రామాల్లో చేపట్టే పారిశుధ్యం స్పష్టంగా కనపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రతి మండలం నుండి కనీసం రెండు గ్రామ పంచాయతీలు పాల్గొని అవార్డులు సాధించేలా అధికారులు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు. 'స్వచ్ఛ సర్వేక్షన్‌' కార్యక్రమాన్ని సర్పంచులు, ఎంపిడిఒలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్‌, ఇన్‌ఛార్జి డిపిఒ మల్లికార్జున్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ ఎన్‌వివి.సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.