
పుట్టపర్తి అర్బన్ : స్పందనలో అందే ప్రతి అర్జీకి మెరుగైన పరిష్కారం చూపాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులు ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, డిఆర్‌ఒ కొండయ్య, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, గ్రామ వార్డు సచివాలయ నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, పుట్టపర్తి ఆర్డివో భాగ్యరేఖతో కలిసి అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ వర్చువల్ విధానం ద్వారా అధికారులతో మాట్లాడుతూ రీ ఓపెన్ పిటీషన్‌లు నాలుగు ఉన్నాయని, రీ ఓపెన్ పిటీషన్లు రాకుండా నాణ్యతగా పిటీషన్లను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రీ ఓపెన్ పిటీషన్‌లను సీరియస్‌గా తీసుకుని పరిష్కరించాలన్నారు. రీఓపెన్ పిటీషన్లను జిల్లా అధికారులు నిత్యం ఓపెన్ చేసి చూసుకోవాలన్నారు. అర్జీదారుడితో మాట్లాడాలని, అర్థమయ్యేలా అతనికి వివరించాలన్నారు. క్షేత్రస్థాయిలో తహశీల్దార్, ఆర్డీవోలు అర్జీలకు నాణ్యతగా పరిష్కారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ విజరు కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పిఆర్ ఎస్‌ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డిఎంహెచ్‌ఒ డా||కృష్ణారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.