ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా): స్పందన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, డిఆర్‌ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఐ కిషోర్లతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి పలు ప్రాంతాల ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు వివిధ ప్రాంతాల నుండి ఎంతో శ్రమకోర్చి వ్యయప్రయాసలతో జిల్లా కేంద్రానికి వస్తున్నారని స్పందన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సానుకూలంగా పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా కోర్టు కేసుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండి సకాలంలో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, రెవెన్యూ, పురపాలక శాఖల్లో కోర్టు ధిక్కరణ కేసులు వచ్చి కలెక్టర్ కోర్టుకు హాజరుకమ్మని ఆదేశాలు రావడం సరైనది కాదన్నారు. ఇకపై ఎవరు కూడా కోర్టు కేసుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ న్యాయవాదులతో సంప్రదించి కౌంటర్లను సకాలంలో దాఖలు చేయాలని, లేని పక్షంలో బాధ్యులైన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్డీవోలు, తహసిల్దార్లు రెవెన్యూ శాఖ పరిధిలో ముటేషన్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. రి సర్వే కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేసి సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8 వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని రూపొందించిన గోడపత్రాన్నికలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారుల పాల్గొన్నారు.










