Feb 06,2023 23:16

జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు
ప్రజాశక్తి - ఏలూరు

              స్పందన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు హెచ్చరించారు. జిల్లాలో స్పందన ద్వారా స్వీకరిస్తున్న రెవెన్యు అర్జీల పరిష్కారంపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపిడిఒలతో జెసి పి.అరుణ్‌బాబు కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుండి సమీక్షించారు. ఈ సందర్భంగా 2022 నవంబర్‌లో వచ్చిన 75 రెవెన్యూ అర్జీల ఎండార్స్‌మెంట్‌, ర్యాండమ్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. అనంతరం జెసి మాట్లాడుతూ స్పందన అర్జీల పరిష్కారానికి సంబంధించిన ఫొటోలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేశారు. ఎండార్స్‌మెంట్‌ను అందజేసి అర్జీదారుని నుండి సంతకం తీసుకోవాలన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో స్వయంగా అధికారులు వెళ్లి విచారణ చేపట్టిన ఫొటో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎండార్స్‌మెంట్‌ పొందిన అర్జీదారునితో నేరుగా జెసి ఫోన్‌ చేసి సమస్య పరిష్కారాన్ని అడిగి తెలుసుకున్నారు. కొంతమంది అధికారులు ఎండార్స్‌మెంట్‌ విషయంలో నాణ్యతతో కూడిన సమాచారం ఇవ్వనందున అర్జీలు రీ ఓపెనింగ్‌ అవుతున్నా యని తెలిపారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకుం టామని జెసి హెచ్చరించారు. వచ్చే స్పందనలో డిసెంబరు ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకూ వచ్చిన అర్జీలను సమీక్షిస్తామని తెలిపారు. ఈ సమీక్షలో ద్వారకాతిరుమల, దెందులూరు, గణపవరం, చింతలపూడి, బుట్టాయగూడెం మండలాల రెవెన్యూ స్పందన అర్జీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి ఎవిఎన్‌ఎస్‌.మూర్తి, కలెక్టరేట్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.