Nov 07,2022 22:29

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
          ప్రజల్లో సంతృప్తిస్థాయి పెంచే విధంగా స్పందన అర్జీల పరిష్కారం ఉండాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను కలెక్టర్‌ స్వీకరించారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 209 అర్జీలు అందాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు జెసి పి.అరుణ్‌బాబు, డిఆర్‌ఒ ఎవి.సత్యనారాయణమూర్తి, ఏలూరు ఆర్‌డిఒ కె.పెంచల కిషోర్‌, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందనలో అందిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించడానికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించి పారదర్శకంగా విచారణచేసి అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఏ అర్జీకూడా రీఓపెనింగ్‌కు ఆస్కారంలేకుండా పరిష్కరింపబడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యతిచ్చి ప్రజాసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుందన్నారు. అర్జీలు పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు.
మండలస్థాయిలో ప్రత్యేకాధికారులు సమీక్షించాలి
మండలాల్లో జరుగుతున్న ప్రభుత్వ ప్రాధాన్యతాకార్యక్రమాల అమలు ప్రగతిని సంబంధిత మండల ప్రత్యేకాధికారులు ఆయా మండలాల్లోని అన్నిశాఖల అధికారులతో ప్రతీవారం సమీక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు. తద్వారా క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్నారు. గృహనిర్మాణాలు నాడు-నేడు, ఉపాధిహామీ, ప్రభుత్వ ప్రాధాన్యత నిర్మాణాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.