ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో స్పందన అర్జీలను గడువులోగా పరిష్కరించడానికిి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో స్పందన కార్యక్రమంలో తమ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్క రించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో పేదలకు మంజూరయిన గృహాలన్నీ వారు నిర్మించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పునాది దశలో ఉన్న గృహ నిర్మాణ లబ్ధిదారులకు డిఆర్‌డిఎ, మెప్మా ద్వారా బ్యాంక్ రుణాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె లక్ష్మీ శివజ్యోతి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరక్టర్ ప్రసాద్, వ్యవసాయ శాఖ జెడి అబ్దుల్ సత్తార్, పశుసంవర్ధక శాఖ జెడి హనుమంతరావు, జిల్లా రవాణా శాఖ అధికారి ఏ చంద్రశేఖర్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ డిఎస్‌ఒ విలియమ్స్, డిఎం శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










