Oct 30,2023 20:09

ప్రజల నుండి నేతలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌

స్పందన అర్జీల పరిష్కారానికి చర్యలు
- జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

    స్పందన సమస్యల వేగవంత పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వైఎస్సార్‌ సెంటినరీ హాలులో స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ టి రాహుల్‌ కుమార్‌ రెడ్డి, డిఆర్‌ఓ పుల్లయ్య, ఇతర జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గతవారం చీఫ్‌ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్లో నంద్యాల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని అభినందించారని, ఈ మేరకు జిల్లా అధికారులందరికీ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరింత ఉత్సాహంతో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇక నుండి ప్రతి సోమవారం రెండు డిపార్ట్మెంట్లు ప్రజలు అసంతృప్తి చెందిన అంశాలు, రీఓపెన్‌ కేసులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని ఆదేశించారు. స్పందన ఈకేవైసీపై శాఖల వారీగా వారం వారం సమీక్ష నిర్వహిస్తామన్నారు. వేలిముద్రలు, ఐరిష్‌ పడని వారికి సంబంధిత ఎంపీడీవో, తాసిల్దార్‌ నుండి డేటా కలెక్ట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చాగలమర్రి మండలం మల్లెవేముల గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రెటరీ గైర్హాజరుపై షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 195 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్‌ ఎస్‌ఎల్‌ఏలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.