
ప్రజాశక్తి-అనకాపల్లి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జెసి జాహ్నవి కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యలపై 129 వచ్చాయి. జెసి జాహ్నవితో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ అర్జీదారుల నుంచి దరఖాస్తుల స్వీకరించారు. జిల్లాస్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో.....
జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ తగాదాలకు చెందిన 34 దరఖాస్తులు ఎస్పీ మురళీకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా అర్జీదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. చట్టపరిధిలో అర్జీలను పరిష్కరించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విజయభాస్కర్, ఎస్బిఐ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా చేస్తున్న గృహ నిర్మాణ పనులు నిలిపివేయాలని వినతి
అచ్యుతాపురం : అచ్యుతాపురం మండలం ఎం జగన్నాధపురం గ్రామంలో సర్వే నెంబరు 70లో అక్రమంగా నిర్మిస్తున్న గృహ నిర్మాణాన్ని నిలిపివేయాలని సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో గ్రామ మాజీ సర్పంచ్ కెఎస్ ప్రకాష్, మాజీ ఉప సర్పంచ్ పి చెన్నయ్య నాయుడు, మాజీ ఎంపీటీసీ పిలా కాసుబాబు, బుది రెడ్డి కాసుబాబు,సేనాపతి సాయి వంశీ, గౌతు రాంబాబు, బోండా అయ్యప్ప ఉన్నారు.