ప్రజాశక్తి -రంపచోడవరం
ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు సంబంధించిన సమస్యలపైనా, వ్యక్తిగత సమస్యలపైనా స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్, ఐటిడిఎ ఎపిఒ సిహెచ్.శ్రీనివాసరావు ఇతర అధికారులతో కలిసి పిఒ స్పందన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన దరఖాస్తులు, ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని, వ్యక్తిగత సమస్యలపైనా దరఖాస్తులు 60 వరకు వచ్చాయి. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ అధికారులు పరిష్కరించగలిగే సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మిగిలిన వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జి.డేవిడ్ రాజు, ఎండి యూసఫ్, వెలుగు ఎపిడి ఎ.శ్రీనివాసరావు, ఐటీడీఏ పరిపాలన అధికారి డిఎన్‌వి.రమణ, డాక్టర్ సతీష్, డాక్టర్ రాధిక, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.










