Jul 27,2023 23:29

గుంటూరులో నిరసనలో పాల్గొన్న ఉద్యోగులు, కార్మికులు

ప్రజాశక్తి-గుంటూరు : విద్యుత్‌ ఉద్యోగుల నిరసనల్లో భాగంగా రాష్ట్ర విద్యుత్‌ ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్థానిక పొన్నూరు రోడ్డులోని విద్యుత్‌ భవన్‌ వద్ద కార్యనిర్వాహక, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. నల్లరిబ్బన్లు, ప్లకార్డులు ధరించి నినాదాలు చేశారు. జెఎసి నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన హక్కుల కోసం ఏడాది కాలంగా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందనా లేదన్నారు. ఇప్పటి నుండి ఆగస్టు 9 వరకూ పలు రూపాల్లో నిరసనలు తెలిపి, అప్పటికీ యాజమాన్యం స్పందించకపోతే ఆగస్టు 10 నుండి నిరవధిక సమ్మెలోకి వెళతామని తెలిపారు. కార్యక్రమంలో జెఎసి చైర్మన్‌ ఆంజనేయుల అధ్యక్షత వహించగా, సెక్రెటరీ రాజేష్‌కన్నా, కన్వీనర్‌ రవిశంకర్‌ ప్రసంగించారు.
ప్రజాశక్తి-తెనాలి : చెంచుపేట విద్యుత్‌ ఈఈ కార్యాలయం వద్ద నిరసనలో నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు 2022 పిఆర్‌సి అమలు చేయాలని, కాంట్రాక్ట్‌ సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇపిఎఫ్‌ను జిపిఎఫ్‌గా మార్చాలని, జెఎల్‌ఎం గ్రేడ్‌ 2 ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పెండింగ్‌ డిఎ బకాయిలను చెల్లించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సమ్మెకు వెళతామని హెచ్చరించారు. నిరసనలో జెఎసి సెక్రటరి పివి సుధీర్‌, నాయకులు మల్లికార్జునరావు, కరీమ్‌ బాషా, విద్యుత్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.