నగదును అందజేస్తున్న ఉపాధ్యాయులు నీరజ
* 'ప్రజాశక్తి' కథనానికి స్పందన
కవిటి: సొంతలాభం కొంతమానుకుని పొరుగు వాడికి సాయపడవోయి.. అన్న గురజాడ కవితకు చిరునామాగా పలువురు దాతలు నిలుస్తున్నారు. 'చిన్ని గుండెకు పెద్ద కష్టం' అంటూ మంగళవారం 'ప్రజాశక్తి'లో వచ్చిన కథనానికి దాతల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పాపకు కొండంత అండగా మేమున్నామంటూ చిన్నా, పెద్ద తేడా లేకుండా తమకు తోచిన సాయం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు దాతల నుంచి తనకు రూ.1.30 లక్షలు అందినట్టు పాప తండ్రి చిరంజీవి తెలిపారు. మండలంలోని పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా సంస్థలు, మరికొంత మంది దాతలు సాయం అందిస్తామని చెప్పినట్టు చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా ఆపద సమయంలో అండగా నిలిచిన 'ప్రజాశక్తి'కి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.










