ప్రజాశక్తి - మంత్రాలయం
సొసైటీల్లో రైతులకు రుణమాఫీ ఉంటుందని అపోహ పడవద్దని, రుణమాఫీ వర్తించదని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, వైసిపి నాయకులు, ఎమ్మిగనూరు ఆర్‌టిసి డిపో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు వై.సీతారామిరెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని కలుదేవకుంట సహకార సంఘం నూతన అధ్యక్షులు కె.రఘునాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బాలనాగిరెడ్డి, సీతారామిరెడ్డి హాజరయ్యారు. వారికి పూలవర్షంతో, డప్పు వాయిధ్యాలతో, బాణసంచా పేల్చుతూ స్వాగతం పలికారు. గజమాలలు, శాలువాలతో వారిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కలుదేవకుంట గ్రామంలో రాఘవరెడ్డి కుటుంబానికి ప్రత్యేకత ఉందని, ఆయన మార్గదర్శకత్వంలో ఈ సొసైటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తొలి అధ్యక్షులుగా ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా సేవలందించి సొసైటీ అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. ప్రస్తుతం ఆయన పెద్ద కుమారుడు రఘునాథ్ రెడ్డికి మళ్లీ సేవ చేసే అవకాశం దక్కిందన్నారు. మాజీ ఛైర్మన్ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ 70 శాతం రికవరీతో రూ.20 కోట్ల టర్నోవర్‌తో ఉందని తెలిపారు. దానిని రూ.40 కోట్ల టర్నోవర్‌కు తీసుకెళ్తామని నూతన అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి చెప్పడం సంతోషంగా ఉందని చెప్పారు. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే వడ్డీ కూడా తక్కువ పడుతుందని తెలిపారు.
తాగునీరు నీటి సమస్య పరిష్కారానికి కృషి
కలుదేవకుంట గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన రంగన్న, భీమయ్య, ఇసాక్‌లు గ్రామంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఏళ్ల నాటి చిన్న పైపులైన్ వల్ల కలుదేవకుంట, చిలుకలడోన గ్రామాలకు నీటి సమస్య ఉందని తెలిపారు. సుమారు రూ.కోటి వ్యయంతో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సి వస్తుందని చెప్పారు. కౌతాళం మండలం ఎరిగేర గ్రామంలో ఇదే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహాయంతో ప్రత్యేక పైపులైన్ ద్వారా త్వరలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
రాంపురం రెడ్డి సోదరుల సహకారంతో సొసైటీ అభివృద్ధికి కృషి
- సొసైటీ నూతన అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి
రాంపురం రెడ్డి సోదరుల సహకారంతో సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన అధ్యక్షులు కె.రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ... 11 గ్రామాల రైతుల అనుసంధానంతో ఏర్పాటు చేసిన సొసైటీ అభివృద్ధికి మాజీ ఛైర్మన్ వెంకట్‌రెడ్డి కృషి చేశారని కొనియాడారు. రానున్న రోజుల్లోనూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, సీతారామిరెడ్డి సహకారం అందించి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి ఎక్కువ నిధులు మంజూరు చేయించాలని కోరారు. రఘునాథ్ రెడ్డికి సొసైటీ సిఇఒ వెంకటేశ్వర్లు సిబ్బందితో పాటు స్నేహితులు, శ్రేయోభిలాషులు శాలువాలు, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్ రెడ్డి, సొసైటీ ఛైర్మన్ మాజీ వెంకట్‌రెడ్డి, మంత్రాలయం, మాలపల్లి, తిమ్మాపురం సర్పంచులు తెల్లబండ్ల భీమయ్య, సీతారామిరెడ్డి, వీరారెడ్డి, రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, కాంతా రెడ్డి, యువ నాయకులు విఖ్యాత్ రెడ్డి, సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వేణుగోపాల్ రాజు పాల్గొన్నారు.










