Jun 07,2023 00:21
పిఎసిఎస్‌ స్థలంలో కనిపించని బోర్డు

ప్రజాశక్తి-భట్టిప్రోలు: భట్టిప్రోలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి చెందిన అద్దేపల్లి గోడౌన్‌ స్థలాన్ని అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నప్పటికీ దానిని అడ్డుకోవటంలో సొసైటీ అధికారులు, పాలకవర్గ సభ్యులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోడౌన్‌ను ప్రొక్లెయిన్‌తో ధ్వంసం చేసి దానిలో ఉన్న ఇనుప గడ్డర్లు స్వాహా చేశారు. ఆక్రమణకు ప్రయత్నిస్తున్నట్లు ముందుగా వార్తలు రావడంతో స్పందించి 'ఆక్రమణదారులు శిక్షార్హులు' అని ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ ఫ్లెక్సీని కూడా పీకి పారేసి మంగళవారం మరోమారు ప్రొక్లెయిన్‌తో చదును చేసే పనిని ఆక్రమణదారులు చేపట్టారు. కానీ ఆ ప్రాంతానికి సంబంధిత అధికారులు రాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిలో సొసైటీ సిఈఓ పాత్ర కూడా ఉన్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా గోడౌన్‌ తొలగించిననాడే సంబంధిత వ్యక్తులపై కేసు కూడా పెట్టకపోవటం అనుమానాలకు తావిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.