Mar 13,2022 13:48

సొరకాయలో నీటిశాతం ఎక్కువ. మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అలాగే తగినంత నీటిని శరీరానికి అందిస్తుంది. సొరకాయను వండాలేగానీ అద్భుతమైన రుచులెన్నో. కాబట్టే సొరకాయకు మరేదీ సాటిరాదు అంటుంటారు భోజన ప్రియులు. మరి మనమూ రకరకాల వెరైటీలను వండేద్దాం..

సొర.. నోరూర..!

అప్పాలు
కావాల్సిన పదార్థాలు: బియ్యప్పిండి - మూడు కప్పులు, గింజలు లేని సొరకాయ తురుము - కప్పు, పచ్చిమిర్చి పేస్టు - రెండు స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను, కరివేపాకు తరుగు - స్పూను, కొత్తిమీర తరుగు - అరకప్పు, నువ్వులు, జీలకర్ర - రెండు స్పూన్ల చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, వంటసోడా - చిటికెడు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం:
* ఒక పాత్రలో సొరకాయ తురుము, బియ్యప్పిండి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, సోడా, నువ్వులు, జీలకర్ర వేసి (అవసరం అనుకుంటే కొద్దిగా నీరు చిలకరించి) చపాతి పిండిలా ముద్ద చేసుకోవాలి.
* ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని, నూనె రాసిన ప్లాస్టిక్‌ పేపరు మీద పలచగా పూరీల్లా వత్తుకుని నూనెలో దోరగా వేగించాలి.
* కమ్మని రుచి గల ఈ అప్పాలు పది రోజుల వరకు నిలువ ఉంటాయి.

సొర.. నోరూర..!

వడియాల కూర

కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు- అరకిలో, జీలకర్ర- స్పూను, ఉల్లిపాయ- ఒకటి, టమోటాలు- రెండు, పచ్చిమిర్చి- నాలుగు, అల్లం తురుము- రెండుస్పూన్లు, పసుపు- అరస్పూను, ఇంగువ- చిటికెడు, కారం- స్పూను, గుమ్మడి లేదా మినప వడియాలు- కప్పు, మంచినీళ్లు- కప్పు, ఉప్పు- తగినంత, గరంమసాలా- అరస్పూను, కొత్తిమీర తురుము- మూడు స్పూన్లు, నూనె- స్పూను.
తయారుచేసే విధానం:
* సొరకాయ తొక్కుతీసి చిన్నముక్కలుగా తరగాలి.
* పాన్‌లో నూనె వేసి కాగాక వడియాలు వేసి వేయించి తీయాలి. తర్వాత ఉల్లిముక్కలు వేసి వేయించాలి. అందులోనే అల్లంతురుము, పచ్చిమిర్చి వేసి వేగాక, టమోటో ముక్కలు వేసి వేయించాలి.
*  తర్వాత పసుపు, ఇంగువ, కారం వేసి వేగాక సొరకాయ ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు వడియాలు కూడా వేసి ఓ నిమిషం కలిపిన తర్వాత నీళ్లుపోసి మరీ మెత్తగా అవకుండా ఉడికించాలి.
*  చివరగా గరంమసాలా, కొత్తిమీర తురుము వేసి ఉడికించాలి.

సొర.. నోరూర..!

పాయసం

కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము- రెండు కప్పులు, చిక్కని పాలు- లీటరు, కండెన్స్‌డ్‌ మిల్క్‌- పావు కప్పు, నెయ్యి- రెండు పెద్ద స్పూన్లు, జీడిపప్పు, బాదం, పిస్తాపలుకులు- అన్నీ కలిపి పావుకప్పు, చక్కెర- అరకప్పు, యాలకులపొడి- అరస్పూను.
తయారుచేసే విధానం:

*  ముందుగా సొరకాయ తురుమును ఓ గిన్నెలోకి తీసుకుని, అది మునిగేలా నీళ్లుపోసి పొయ్యిమీద పెట్టాలి.
* ఆ తురుము ఉడికిన తర్వాత నీళ్లు పిండేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. స్టౌమీద పాన్‌పెట్టి నెయ్యి వేయాలి.
* అది కరిగాక డ్రైఫ్రూట్స్‌ పలుకులు వేయించి, సొరకాయ తురుము వేయాలి.
*  తడి పూర్తిగా పోయాక దాన్ని ఓ ప్లేటులోకి తీసుకోవాలి.
*  తర్వాత పాలను పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగి సగం అయ్యాక కండెన్స్‌డ్‌మిల్క్‌, రెడీగా ఉన్న సొరకాయ తురుము, చక్కెర వేసి బాగా కలపాలి.
* అది చిక్కగా అవుతున్నప్పుడు యాలకులపొడి వేసి దింపేయాలి.

సొర.. నోరూర..!

పచ్చి రొయ్యలతో

కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు- పావుకేజీ, సొరకాయ ముక్కలు- పావుకేజీ, చిన్న ముక్కలుగా కోసిన టమోటాలు- రెండు, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- రెండు, ఉప్పు- తగినంత, గరంమసాలాపొడి- స్పూను, ధనియాల పొడి- రెండు స్పూన్లు, లవంగాలు- మూడు, దాల్చిన చెక్క- చిన్నముక్క, యాలకులు- రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు- రెండుస్పూన్లు, కారం- రెండు స్పూన్లు, పసుపు- అరస్పూను, ఎండుకొబ్బరి ముక్కలు- నాలుగు.
తయారుచేసే విధానం:
* పచ్చి రొయ్యలను శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి.
* ఎండుకొబ్బరి, లవంగాలు, యాలకులను మిక్సీ పట్టి పొడిచేయాలి.
* పాన్‌లో నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
* అందులోనే అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఒకదాని తర్వాత మరొకటి వేయాలి.
* ఇంకా పచ్చిరొయ్యలు వేసి వేయించాలి. రొయ్యల్లోని నీరు ఇగిరేంత వరకు వేయించాలి.
* తర్వాత సొరకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి.
* తక్కువ మంటమీద టమోటా, సొరకాయలో ఉన్న నీటితో కూరను ఉడికించాలి.
* దీంట్లో పసుపు, కారం, ఉప్పువేసి మూతపెట్టి మరికాసేపు మగ్గనివ్వాలి. తక్కువ మంటమీదే ఉడికించాలి.
* ఇప్పుడు మసాలా పొడి వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి కాసేపు ఉంచి కూర దగ్గరకు వచ్చిన తర్వాత దించేయాలి.
* ఇది అన్నంలోకే కాకుండా చపాతీ, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది.