ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఎర్రకాలువ వంతెనపై గోతులను సోషల్ వర్కర్స్ బృంద సభ్యులు పూడ్చి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆదివారం కామవరపుకోటకు చెందిన సోషల్ వర్కర్స్ టీమ్ సభ్యులు ఎర్రకాలువ వంతెనపై ఏర్పడిన గోతులను సిమెంట్‌తో పూడ్చి మరమ్మతు చేశారు. ఈ సందర్భంగా సోషల్ వర్కర్స్ టీమ్ సభ్యులు పండూరి రామసాయి, వీరమళ్ల సౌజన్ సాయి మాట్లాడుతూ నిత్యం అనేక వాహనాలు ప్రయాణించే వంతెనపై ఏర్పడిన గొతుల వల్ల ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు స్వచ్ఛందంగా మరమ్మతు చేశామని తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు జిల్లా కేంద్రం ఏలూరుకు రాకపోకలు సాగిస్తున్న వంతెనపై ఏర్పడిన గోతులను పట్టించుకోకపోవడంతో తాము స్పందించామని తెలిపారు. వంతెనపై ఏర్పడిన గోతుల్లో ఇనుప ఊచలు బయటపడి పలువురికి గాయాలైన సంఘటనలను గుర్తుచేశారు. వంతెనపై మరమ్మతులు చేయడానికి సుమారు రూ.మూడు వేలు ఖర్చు అయిందని తెలిపారు. కామవరపుకోట సోషల్ వర్కర్స్ బృంద సభ్యులు చేసిన మంచి పనిని పలువురు అభినందించారు.










