
ప్రజాశక్తి-సీతమ్మధార : సోలార్ విద్యుత్తు వాడకం వల్ల కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి ఇఎఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. నగరంలోని పౌర గ్రంథాలయంలో డిసెంట్రలైజ్‌డ్ సోలార్ పవర్ సిస్టం అంశంపై సోమవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఎఎస్ శర్మ మాట్లాడుతూ, సోలార్ విద్యుత్ చాలా చౌక అని చెప్పారు. సోలార్ సిస్టమ్‌ను కార్పొరేట్ కంపెనీలకే కాకుండా, స్వతంత్రంగా గృహాలకు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. సోలార్ సిస్టమ్ వాడకాలను ప్రారంభిస్తే కరెంట్ అవసరం ఉండదన్నారు. సోలార్ పవర్‌ను అభివృద్ధి చేస్తే ఆర్థిక అవసరాలు మెరుగుపడతాయని స్పష్టంచేశారు. రాష్ట్రంలో అధిక భాగం విద్యుత్తును ధర్మల్ పవర్ స్టేషన్ల ద్వారా ఉత్పత్తి చేసుకుంటున్నామని గుర్తు చేశారు. థర్మల్ పవర్ ద్వారా ఒక మెగా వాట్ సామర్థ్యానికి రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు పెట్టుబడి అవుతుందన్నారు. బొగ్గు నాణ్యత తక్కువగా ఉండడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ఖర్చు పెరుగుతుందని తెలిపారు. పవర్ స్టేషన్ల ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించే నిధుల నుంచి రెన్యువల్ ఎనర్జీ ప్లాంట్లను గ్రామీణ స్థాయిలో నెలకొల్పేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలు తయారుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం అనకాపల్లి నేత కాండ్రేకుల వెంకటరమణ, కిసాన్ సర్వీస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అక్కినేని భవాని ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.