Jul 20,2022 00:50

మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన సోలార్‌ ఫ్లోటింగ్‌ పేనల్స్‌

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
మహా విశాఖ నగర పాలక సంస్థ (జివిఎంసి) నరవ వద్దగల మేఘాద్రిగెడ్డపై ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి సంబంధించిన పనుల వేగవంతంపై దృష్టిసారించింది. ఈ మేరకు తొలి దశలో అక్కడ ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ పేనల్స్‌ను రిజర్వాయర్‌ ఉపరితలంపై అమర్చారు. విసిఐసి కారిడార్‌కు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్న నేపథ్యంలో ఎపి ప్రభుత్వం - ఏషియన్‌ డవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎడిబి)తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఇప్పటికే ఎడిబి సాయం రూ.14 కోట్లు అందించింది.
అంతా సెట్‌ చేసిన జివిఎంసి
ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ను ఇప్పటికే ముడసర్లోవ రిజర్వాయర్‌పై ఆరిలోవ వద్ద 2 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 3 మెగావాట్ల ఉత్పత్తికి మేఘాద్రిగెడ్డపై ప్లాన్‌ చేశారు. దీని వల్ల రిజర్వాయర్‌పై నీటి నిల్వలు వృథా కావని జివిఎంసి అదికారులు చెబుతున్నారు. పర్యావరణంరీత్యా సోలార్‌ పవర్‌ ఎంతగానో దోహదం కానుందని వెల్లడిస్తున్నారు. తక్కువ కాల వ్యవధిలోనే ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ చెబుతున్నారు. జివిఎంసి లెక్క ప్రకారం ఏడాదికి 4.2 మిలియన్‌ యూనిట్లు (42 లక్షల యూనిట్లు) ఉత్పత్తి చేయడానికి మామూలుగా అయితే 54 వేల టన్నుల కోల్‌ (బొగ్గు) అవసరం. అంతేగాక విద్యుత్‌ ఉత్పత్తి చేపడితే కోల్‌ను మండించడం ద్వారా 3220 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు బయటకొచ్చి కాలుష్యానికి కారణమయ్యేవి. కానీ సోలార్‌ ప్రాజెక్టుతో పర్యావరణం రక్షించబడినట్లే. అంతేగాక ఇదే ప్రాజెక్టును భూమిమీద ఏర్పాటు చేయాల్సి వస్తే 12 ఎకరాల స్థలం అవసరం అవుతుంది. రిజర్వాయర్‌పై నిర్మాణం చేయడం వల్ల రిజర్వాయర్‌ ఏరియాలో 0.1 శాతమే పేనల్స్‌ ఆక్రమించనున్నాయి. మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌ 1979 నుంచి వినియోగంలో ఉంది. చాలా వరకూ రిజర్వాయర్‌లతో పోల్చితే మేఘాద్రిగెడ్డ అత్యధిక ఏరియాను కలిగి ఉంది. తాజాగా సోలార్‌ వెలుగులకు దోహదపడనుంది.
విసిఐసి కోసమా ?
ఈ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును ఎడివి విసిఐసి డెవపల్‌మెంట్‌ ప్రాజెక్టు కింద చేపడుతున్నారు. అయితే ఈ పవర్‌ పేనల్స్‌ను అమర్చడం వెనుక మేఘాద్రి గెడ్డ నుంచే విశాఖ జిల్లాలో విసిఐసి కారిడార్‌కు అవసరమైన నీటిని భవిష్యత్‌లో కొంతమేర అందిస్తారా ? లేదంటే ఎడిబియే విసిఐసి ప్రాజెక్టుకు ఎయిడ్‌ అందిస్తున్న క్రమంలో సోలార్‌ పేనల్స్‌ ఏర్పాటు చేస్తుందా ? అన్నది తెలియాల్సి ఉంది.