సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కు
నేడు వర్చువల్ విధానంలో సిఎం శంకుస్థాపన
- ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి
ప్రజాశక్తి - అవుకు
అవుకు మండలంలోని జూనుంతల, పిక్కిళ్లపల్లి తండా, మారేమడుగుల గ్రామాల పరిధిలో ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ ప్రాజెక్టుకు నేడు వర్చువల్ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద శంకుస్థాపన ఏర్పాటు పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో భూమి పూజ చేసే సందర్భంగా జయింట్ కలెక్టర్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పైలాన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వస్తున్న సందర్భంగా వారికి కావాల్సిన ఏర్పాట్లపై స్థానిక రెవిన్యూ అధికారులతో చర్చించారు. 2300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ గ్రీన్ కో కంపెనీచే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడంతో అన్ని ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో అవుకు తహశీల్దార్ శ్రీనివాసులు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










