
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి జిల్లాలో ఒకవైపు అనధికారికంగా విద్యుత్ కోతలు అమలు అవుతున్నాయి. పగటి పూట విద్యుత్ వినియోగం కోసం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు తక్కువ ధరలకు విద్యుత్‌ను అందించేందుకు వీలుగా సబ్సిడీపై సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం ఉన్నా విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ దిశగా అడుగులు వేయడం లేదు. ప్రజలు ఎవరికి వారు తమ ఇళ్లల్లో సోలార్ కనెక్షన్లు తీసుకునేందుకు ముందుకు వస్తున్నా సబ్సిడీ నిలిపివేయడం సర్వత్రా విమర్శలు వక్తం అవుతున్నాయి.
సోలార్ కనెక్షన్లకు గతంలో సబ్సిడిపై కనెక్షన్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత రెండేళ్లుగా సబ్సిడీ నిలిపివేశారు. పెద్ద నివాస భవనాలకు ఐదు కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటుకు నెడ్‌క్యాప్ సంస్థకు రూ.3.62 లక్షలు చెల్లించాలి. చిన్న నివాస భవనాలకు 3 కిలోవాట్ల ప్లాంట్‌కు రూ.2.29 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో సోలార్ కనెక్షన్‌కు 2019 వరకు 30 శాతం సబ్సిడీ ఇచ్చే వారు. గత మూడేళ్లుగా సబ్సిడీ నిలిపి వేశారు. ఇంత సొమ్ము ఒకేసారి చెల్లించి సామాన్యులు సోలార్ కనెక్షన్లు తీసుకోలేకపోయినా మధ్య తరగతి ప్రజలు కొంతవరకు తీసుకునే అవకాశం ఉంది.
అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై భారం మోపుతున్న పంపిణీ సంస్థలు సోలార్, విండ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి తగిన ప్రోత్సాహాకాలు అందించడంలేదు. వ్యాపారులు, ఆస్పత్రులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా పగటి పూట చాలా వరకు విద్యుత్ కొనుగోలుకు తగ్గించుకునే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయడం లేదు. మారిన పరిస్థితుల్లో బొగ్గు ధరలు పెరిగిన నేపథ్యంలో పగటి సమయంలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా యూనిట్ రూ.10నుంచి13వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నామని చెబుతున్న అధికారులు ప్రత్యామ్నాయ ఉత్పత్తికి అవకాశాలపై దృష్టి సారించడం లేదు.
ఏడాదిలో 10నెలల పాటు పగటి సమయంలో సూర్యరశ్మితో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. దీనిని గ్రిడ్‌కు అనుసంధానం చేయడం వల్ల ఎక్కడ ఎక్కువ అవసరం ఉంటే అక్కడ వినియోగించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. చాలా వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు శ్రద్ధ చూపకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నదీ అధికారులు వెల్లడించాల్సి ఉంది. గుంటూరులో ఇప్పటికే ట్రాఫిక్ సిగల్స్‌కు, కలెక్టరేట్, నగరపాలక సంస్థ, ఇతర కార్యాలయాల్లో సోలార్ విద్యుత్‌ప్లాంట్లు ఉన్నాయి. కలెక్టరేట్‌లో 80 కిలో వాట్ల సామర్ధ్యంతో ప్లాంటు పని చేస్తోంది. ఈ ప్లాంటు 30 ఏళ్లపాటు పనిచేస్తుంది. అలాగే కొంతమంది ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వైద్యులు తమ ఆస్పత్రుల్లో ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. సంగంజాగర్లమూడి వద్ద కార్పొరేషన్ వాటర్‌వర్క్సుకు కూడా సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొంత మంది ఇళ్లకు కూడా సోలార్ కనెక్షన్లు తీసుకున్నారు. ఎక్కువ మంది సోలార్ కనెక్షన్లు తీసుకునే విధంగా విద్యుత్ శాఖ అధికారులు తగిన ప్రోత్సాహం ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి.