Jun 24,2023 20:27

సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

ప్రజాశక్తి - హోళగుంద
హిందూ, ముస్లింలు సోదరభావంతో మెలగాలని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కోరారు. శనివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో బక్రీద్‌ పండగ సందర్భంగా పీస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హోళగుంద కర్ణాటక సరిహద్దు మండలమని తెలిపారు. కర్ణాటక సంప్రదాయాలు ఎక్కువని, ఫ్యాక్షన్‌ అనే పదానికి దూరంగా ఉంటారని చెప్పారు. గతంలో హిందూ, ముస్లింల మధ్య ఒక చిన్న సంఘటన జరగడం వల్ల ఒక మచ్చ ఏర్పడిందన్నారు. ఈ మచ్చ తొలగిపోవాలంటే అందరూ సోదరభావంతో మెలగాలని కోరారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, చట్టం పరిధిలో ఉన్నంత వరకు అందరికీ రక్షణ ఉంటుందని తెలిపారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే నడుచుకుంటారో వారికి ఏ రక్షణా ఉండదని చెప్పారు. వాట్సప్‌ గ్రూపుల్లో మతపరమైన పోస్టులు ఏ ఒక్కరూ చేయకూడదన్నారు. ఇతరులను ఇబ్బంది పెట్టే అంశాలను వాట్సప్‌ గ్రూపులో పోస్టు చేస్తే గ్రూపు అడ్మిన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకొని శాంతియుతంగా పండగలను జరుపుకోవాలని కోరారు. ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీనివాసులు, తహశీల్దార్‌ హుస్సేన్‌ సాబ్‌ పాల్గొన్నారు.